రూ.3,222 కోట్లతో దివ్యక్షేత్రంగా తిరుపతి అభివృద్ధి

రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌

తిరుపతి : తిరుపతి–తిరుమల ప్రాంతాన్ని ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల సమన్వయంతో దివ్య క్షేత్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సచివాలయం సిఎంవో నుంచి వర్చువల్‌గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ‘వెంకటాద్రి’ యాప్‌ను ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్క్‌ రహదారి వద్ద రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్‌, వైద్య సేవలు, డిజిటల్ సమాచార కేంద్రాలు తదితర సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో పది అంతస్తుల చొప్పున మొత్తం 2,700 గదులను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. రూ.160 కోట్లతో నిర్మించే అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు. రూ.311 కోట్లతో 4,500 వాహనాలకు సరిపడే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని, రూ.90 కోట్లతో 30 బస్‌ బేలతో కూడిన సమీకృత రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు శ్రీవారి చరిత్ర, వైభవం, సంప్రదాయాలను పరిచయం చేసే పిలిగ్రిమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌, ఆధునిక భద్రతా వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

శ్రీవారి సేవలో నిరంతరం నిమగ్నమయ్యే టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా పాదిరేడు అరణ్యం వద్ద 418 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న గృహ స్థలాల లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.230 కోట్లు వెచ్చించనున్నారు. తొలి, రెండో దశల్లో మొత్తం 5,192 మంది ఉద్యోగులకు కేటాయించిన గృహ స్థలాల్లో రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి కేంద్రం, విద్యుత్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు . ఇందులో టీటీడీ రూ.150 కోట్లు, ఉద్యోగులు రూ.80 కోట్లు సమకూర్చనున్నారు. ఈ టౌన్‌షిప్‌ను పర్యావరణహిత నెట్‌జీరో ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉంటే వారు మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించగలరని పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చినందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మెరుగు పరిచేందుకు రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం సుమారు 20 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనుల్లో తుడా రూ.127 కోట్లతో 16.50 కిలోమీటర్లు, టీటీడీ రూ.115 కోట్లతో 3.60 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ రహదారులు జాతీయ రహదారులు 140, 71 మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించనున్నాయి. తిరుపతిలోని చెరువులను అనుసంధానించి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఔషధ మొక్కల ప్రాంతాలను ఆధ్యాత్మిక, ప్రకృతి అనుభూతిని అందించే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేస్తూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా చాటిచెప్పాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!