హైదరాబాద్ : కోవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభమే ఎల్నినో అని, కరువు పరిస్థితుల్లో ప్రజలకు సరిపడా ప్రభుత్వం వద్ద బియ్యం, ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కానీ నీళ్లు లేవు. ప్రకృతి వల్ల తలెత్తిన ఈ పరిస్థితులను తట్టుకోవడానికి ముఖ్యంగా రైతులను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. రాబోయే 8 నెలలు వర్షాలు పడవు అని ఇప్పటికే సమాచారం ఉందన్నారు. . ఈ పరిస్థితులను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగంగా నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వాతావరణ అనుకూల స్మార్ట్ రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ , ప్రముఖ పర్యావరణ వేత్త రాజేంద్ర సింగ్ , పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి తో పాటు పలువురు నిపుణులు, ప్రొఫెసర్లు, వ్యవసాయ, వాతావరణ రంగాల్లో నిపుణులు, మేయర్లు, సర్పంచులు, వన సంరక్షణ సమితి, రైతులు, పర్యావరణ వేత్తలు పాల్గొని వారి అనుభవాలను ఈ వేదికగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. తుఫాను, వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు నష్టం వెంటనే జరుగుతుందన్నారు. కరువు మాత్రం నెమ్మదిగా ప్రారంభమై ఒక సమయానికి తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత చలికాలంలో ఎండాకాలం వాతావరణం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితిని మనమంతా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. పంటలు పండక పోయినా ఆహార ధాన్యాలు ఉన్నట్లు తెలిపారు. నీటి కరువును ఎదుర్కోవడం ముఖ్యం అన్నారు. రైతులు ఒక పంటను త్యాగం చేస్తే పశుసంపదను కాపాడుకోగలం అని తెలిపారు సీఎం. ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రభుత్వమే కాదు. మానవాళిని కాపాడాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. అందుకే రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. మేం మాట్లాడితే రాజకీయ కోణంలో చూస్తారని , పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు సీఎం. అందుకే వేదికపైన ఉన్న ప్రముఖులను ఆహ్వానించాం అని తెలిపారు.
ప్రకృతిని రక్షించడానికి పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన విధానం కావాలన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని చేయకుండా అనుభవం ఉన్న వారందరితో చర్చించి వారిచ్చిన సూచనలను ప్రణాళికా బద్ధంగా అమలు చేయాలన్న ఆలోచనతో ఈ సదస్సును నిర్వహించామని తెలిపారు సీఎం.
