ఆపరేషన్‌ కవచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాలకు కళ్లెం : డీజీపీ

ఆస్తి నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు

హైదరాబాద్ : నేరాల నియంత్రణలో పెట్రోలింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని డీజీపీ సి.వి.ఆనంద్‌ అన్నారు. ఆస్తి సంబంధిత నేరాల నమోదును తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సైబర్‌ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రికవరీ చేయడంలో, శిక్షణ ఖరారులో కామారెడ్డి పోలీసులు చూపుతున్న పనితీరును అభినందించారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నేరాల నియంత్ర‌ణ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి పెట్రోలింగ్‌ పెంచాలని సూచించారు. పోక్సో సహా వివిధ నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. సైబర్‌ మోసాల్లో పోగొట్టుకున్న నగదును బాధితులకు తిరిగి అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు.

గతంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పనిచేసిన అనుభవాలను డీజీపీ గుర్తు చేసుకున్నారు. 1996 ఆగస్టు నుంచి 1999 డిసెంబరు వరకు సుమారు మూడున్నరేళ్లపాటు ఇక్కడ విధులు నిర్వర్తించానన్నారు. అప్పట్లో నక్సల్స్‌ సమస్య తీవ్రంగా ఉండేదని, గ్రామాల్లో దళాల సంచారం, పట్టణాల్లో టౌన్‌ పార్టీల కార్యకలాపాలతో నిరంతరం సవాళ్లు ఎదురయ్యేవని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనలకు కూడా భద్రత కల్పించడం కష్టంగా ఉండేదన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ పోలీసుల సమష్టి ప్రణాళికతో మూడు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడినప్పటికీ సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ ప్రధాన సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలతో సరిహద్దులు ఉండటంతో అంతర్రాష్ట్ర నేర ముఠాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. గతంలో ఏటా 10 నుంచి 15 వరకు ముఠాలు జిల్లాలో సంచరించే పరిస్థితి ఉండేద‌న్నారు. వాటి కట్టడికి చేపట్టిన ఆపరేషన్‌ కవచ్‌ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ ఆపరేషన్‌ను మరింత సమర్థంగా కొనసాగించాలని సూచించారు. దేశాన్ని 2029 డిసెంబరు 31 నాటికి నషా ముక్త్‌ భారత్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఈగల్‌ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి డ్రగ్స్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై పీసీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!