చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా నీట్ లో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు చెన్నైలో. ఈ సందర్బంగా పోలీసులు ఆందోళనకారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కూటమి సర్కార్ ఉన్నప్పటికీ తమపై ఎలా కేసులు నమోదు చేస్తారంటూ బాధితులు ఆరోపించారు. ఆపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇదిలా ఉండగా ప్రస్తుతం టీవీకే సర్కార్ కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఇతర పార్టీల మద్దతుతో కొనసాగుతోంది. తమ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలపై క్రిమినల్ కేసులు ఎలా నమోదు చేస్తారంటూ గట్టిగా నిలదీశారు. ఆపై సీఎంను కలిసి వారిపై నమోదైన కేసులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
దీంతో సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. నీట్ నిరసనకారులపై నమోదైన క్రిమినల్ కేసులను ఉపసంహరించు కోవాలని ఆదేశించారు. నిరసనకారులపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లగా, ఆయన సూచన మేరకు ఆ కేసులను ఉపసంహరించు కోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. నీట్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న సుమారు 1,800 మందిపై నమోదైన 65 క్రిమినల్ కేసులను ఉపసంహరించు కోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశించారు. ఈ ఏడాది మే 10 నుండి జూలై 31 మధ్య నీట్ నిరసనకారులపై నమోదైన క్రిమినల్ కేసుల స్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రాగా, ఆయన సలహా మేరకు ఆ కేసులను ఉపసంహరించు కోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. క్రిమినల్ కేసులను ఉపసంహరించు కోవడానికి అవసరమైన చట్టపరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
