విశాఖపట్నం జిల్లా : పెట్టుబడుల సదస్సులో భాగంగా ఈ నెల 11 తేదీన బుధవారం పారిశ్రామిక ప్రతినిధుల మధ్య ముందస్తు సమావేశాలు జరుగనున్నాయి. అదే రోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి అధికారిక విందు ఇవ్వనున్నారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో 12, 13 తేదీల్లో ప్రధాన సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సమాంతరంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ 2026 నిర్వహిస్తారు. 12 తేదీ ఉదయం 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి నారా లోకేష్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి రాబర్టో తదితరులు సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్నారు. ఇక నవంబర్ 13, సాయంత్రం 4 గంటలకు సదస్సు ముగింపు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, వాల్యుచైన్, క్వాంటం టెక్నాలజీ, సెమీ కండక్టర్ సహా నూతన సాంకేతికతలు, అంతర్జాతీయ సహకారం, నైపుణ్యాలు, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, ఆహార భద్రత, జీవ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి.
గత పెట్టుబడుల సదస్సు సహా వివిధ సందర్భాల్లో ఒప్పందాలను పారిశ్రామిక ప్రాజెక్టులుగా మలిచేందుకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రులు, అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి. మరో రూ.17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. 2025-26లో దేశంలోనికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.6 శాతం ఏపీ దక్కించుకుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన 6 సన్నాహక ప్రాంతీయ సదస్సుల ద్వారా 194 ఎంఓయూల ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. తద్వారా 1.47 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.