హైదరాబాద్ : దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రపంచ స్థాయి విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రియాంక చోప్రా కీ రోల్ పోషించనున్నార. ఈ కథ పురాణాలు, భక్తి , సాహసాల నేపథ్యంలో సాగుతుందని భావిస్తున్నారు. రాజమౌళి ఇప్పటికే మూడు నిమిషాల ప్రమోషనల్ వీడియో ద్వారా ఈ చిత్ర ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే, కథకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన గోప్యంగా ఉంచారు. ఇంతలో సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశం గురించి ఒక ఊహాజనిత కథనం చక్కర్లు కొడుతోంది, ఇది అభిమానుల్లో మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
గతంలో రాజమౌళి వెల్లడించిన వివరాల ప్రకారం ‘వారణాసి’ చిత్రం వర్తమాన కాలంతో పాటు శ్రీరాముని కాలమైన ‘త్రేతా యుగం’కు సంబంధించిన సన్నివేశాలను కలిగి ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని భాగాల్లో మహేష్ బాబు శ్రీరాముని పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఆధునిక కాలం , రామాయణ కాలం కలయికతో కూడిన ఈ కథాంశంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఒక ఆసక్తికరమైన ఫ్యాన్ థియరీ ప్రకారం.. ఈ సినిమా కథ పునర్జన్మ, శక్తివంతమైన వజ్రాలు , కాల ప్రయాణం చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ అనే పాత్ర, రావణుడి సోదరుడైన కుంభకర్ణుడి పునర్జన్మ అని తెలుస్తోంది.
ఈ కథనం ప్రకారం, ‘కుంభ’ పాత్రకు కాళ్లు కదిలించే శక్తి ఉండదు. తన సోదరుడు రావణుడికి చెందిన తొమ్మిది వజ్రాలను సేకరించడమే అతని ప్రధాన లక్ష్యం. శ్రీరాముడికి, రావణుడికి మధ్య జరిగిన యుద్ధ సమయంలో ఈ వజ్రాలు వేర్వేరు దేశాలకు చెల్లా చెదురయ్యాయని చెబుతారు. స్వయంగా ప్రయాణించలేని స్థితిలో ఉన్న ‘కుంభ’, ఆ తొమ్మిది వజ్రాలను వెతికి తీసుకు రావడానికి మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ అనే పాత్రను పంపిస్తాడు.