అమరావతి : సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మారి అక్కడ స్థిరపడినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్న దగ్గుబాటి రానా ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. క్రియేటర్ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటి అని అన్నారు. సినిమాలు, యూట్యూబ్, గేమింగ్ అన్నీ ఇందులో భాగమే. నా కుమారుడు దేవాన్ష్‌కు కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. రాష్ట్రంలోని పిల్లలు, కళాశాల విద్యార్థుల్లోనూ ఇలాంటి సృజనాత్మకత ఉంది, చేతిలో ఉన్న ఫోన్‌తోనే వీడియోలు రూపొందించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో నిర్మాతలు, దర్శకులకు స్థలాలు కేటాయించి స్టూడియోలు నిర్మించుకునేలా ప్రోత్సహించడంతో షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అవసరమైన సదుపాయాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం నుంచి సహకారం, పరిశ్రమ నుంచి చొరవ ఉంటే విశాఖలోనూ సినిమా పరిశ్రమకు మంచి అవకాశాలు సృష్టించవచ్చని రానా చెప్పారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. రానా ఇందుకు ఈ బాధ్యత తీసుకోవాలని, సినిమా, గేమింగ్ రంగాల్లో ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌లో క్రియేటర్లకు అవసరమైన సదుపాయాలపై ఉమ్మడి ప్రణాళిక రూపొందిద్దామని ప్రతిపాదించారు. ఇందుకు రానా స్పందిస్తూ…వైజాగ్‌లో సినిమా రంగంతో పాటు ఇతర క్రియేటివ్ రంగాల వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. దీనిపై బ్లూప్రింట్ ను సోమవారం ఉదయానికల్లా సిద్ధం చేస్తానని రానా చెప్పగా, అదే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని లోకేష్ చమత్కరించారు.