హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పని చేసిన వీసీ సజ్జనార్ ను ఉన్నట్టుండి బదిలీ చేసింది తెలంగాణ సర్కార్ . ఈ సందర్బంగా మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఖాకీ దుస్తులు ధరించిన అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడు సజ్జనార్ అంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది రాజకీయ, పోలీస్ వర్గాలలో. కేవలం బదిలీ చేస్తే సరిపోదని, తనపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బదిలీ రాష్ట్ర అధికార యంత్రాంగంలోనూ, పోలీసు శాఖలోనూ పెద్ద చర్చకు దారితీసింది. సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. సజ్జనార్ పదవీకాలంలో జరిగిన అక్రమాలు చాలా ఉన్నాయన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆధారాలు బయట పెట్టలేదు. దీనిపై ఇంకా స్పందించలేదు సజ్జనార్.
పరిపాలనా పరమైన మార్పుల్లో భాగంగా ప్రభుత్వం వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది. గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో సజ్జనార్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు , జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే బదిలీ ప్రకటన వెలువడిన వెంటనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు చేసిన ఘాటైన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సజ్జనార్ యూనిఫాం వెనుక దాక్కున్న ఒక నేరస్థుడిలా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తోటి ఐపీఎస్ అధికారి గురించి ఇలాంటి కఠినమైన పదాలు వాడటం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని పేర్కొన్న ఆయన, చేదు నిజాలను బయట పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. సజ్జనార్ తన పదవీకాలంలో పాల్పడినట్లు ఆరోపణలున్న అక్రమాలు, అధికార దుర్వినియోగంపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి నాయకత్వం వహించిన ఒక సీనియర్ రిటైర్డ్ అధికారి, మరొక కీలక ఐపీఎస్ అధికారిపై నేరుగా ఆరోపణలు చేస్తూ విచారణకు డిమాండ్ చేయడం, ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా పోలీసు శాఖలోనూ పెద్ద చర్చకు దారితీసింది. నాగేశ్వరరావు చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై సజ్జనార్, ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.