Adavi Bapiraju: రచయిత, చిత్రకారుడు

బావా బావా పన్నీరు పాట రచయిత

అడివి బాపిరాజు

Adavi Bapiraju : అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 – సెప్టెంబరు 22, 1952): పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో జన్మించిన అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, చిత్రకారుడు, నాటక కర్తగా గుర్తింపు పొందారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపిన బాపిరాజు 1922లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు కెళ్ళాడు. దీనితో జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. అలాగే తన జైలు జీవితానుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరిచాడు.

Adavi Bapiraju – చిత్రకారునిగా బాపిరాజు

బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించి తిక్కన, సముద్ర గుప్తుడు లాంటి చిత్రాలు గీశాడు. బాపిరాజు(Adavi Bapiraju) చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రీకరించింది బాపిరాజే. వాగ్దేవి, వేణీ భంగము, భారతి మొదలగునవి బాపిరాజు కుంచె నుండి జాలువారిన చిత్రాలు.

రచయితగా బాపిరాజు

భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ అనేక సాంఘిక, చారిత్రక నవలలు రాశాడు. వాటిలో నారాయణరావు, తుఫాను, గోనగన్నారెడ్డి, కోనంగి, హిమబిందు, అడవి శాంతిశ్రీ, అంశుమతి, నరుడు, జాజిమల్లి ముఖ్యమైనవి. తెలుగు నాట విస్తృతంగా ప్రచారంలోనున్న “బావా బావా పన్నీరు” పాట అడవి బాపిరాజు కలం నుండి జాలువారిన అణిముత్యం. అందుకే సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా “బాపి బావ” అని పిలిచేవారు. అలాగే రేడియో నాటకాల్లో “దుక్కిటెద్దు, ఉషా సుందరి, భోగిరలోయ, నారాయణరావు, శైలబాల, పారిజాతం”.. నాటికలు అద్భుతంగా రేడియోలో ప్రదర్శింపబడి శ్రోతల మదిని దోచుకున్నాయి. కథల సంపుటాలలో “తరంగిణి, రాగమాలిక, అంజలి, వింద్యాచలం”.. ప్రసిద్ధి చెందినవి. ఇంకా బాపిరాజు రచించిన “శశికళ పాటల సంపుటి” అద్భుత ప్రాచుర్యం పొందింది.

బాపిరాజు సినీ ప్రస్థానం

1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి, పల్నాటి యుద్ధం వంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించాడు. అడవి బాపిరాజుగారు ప్రతిభాపాటవాలకు మెచ్చి ప్రముఖులంతా వీరిని “ఆంధ్ర రవీంద్రుడు” అనేవారు.

Also Read : Gidugu Rammurthy: వ్యవహారిక భాషోద్యమ కర్త

 

Leave A Reply

Your Email Id will not be published!