తిరుమల : శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణ, సంబంధిత విభాగాల సిబ్బంది సేవకులతో నడుచు కోవాల్సిన విధానం, సేవకుల నుండి ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై ప్రస్తావించారు. శ్రీవారి సేవకుల నుండి అత్యుత్తమ సేవలను భక్తులకు అందించడంలో భాగంగా సేవ అనంతరం సంబంధిత సేవకుల అభిప్రాయాలను, అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా తక్షణ పరిష్కార వ్యవస్థ తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సంబంధిత విభాగాలు సేవకులకు బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని, శ్రీవారి సేవకుల సేవలను సమర్థవంతంగా వినియోగించు కోవాలని సూచించారు. సత్సంగ కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మిక వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలు, నైతిక, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు ఏఈవో. భక్తులు, సేవకులు, ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు..
