పల్లె ప్రగతి కోసం పారదర్శక సర్వేకు శ్రీకారం
జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్
అమరావతి : గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు . పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అలాగే 2వ విడతలో 2,750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం అని తెలిపారు. మొదటి విడతలో 22,500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గానూ 22,514 పూర్తి చేశాం అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. రెండవ విడతలో 15 వేల లక్ష్యానికి గానూ 15,303 గోకులాలు నిర్మించాం అన్నారు. పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల లక్ష్యానికి గానూ 15,188 నీటి తొట్టెలు నిర్మించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 20 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 21 వేలు పూర్తి చేశాం. రెండవ విడతలో ఈ పనులను భారీగా పెంచి, 81 వేలు లక్ష్యానికి గానూ 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించాం అన్నారు. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు.