Aware Madhavan : పేద‌ల బాంధ‌వుడు మాధ‌వ‌న్

అవేర్ తో సామాజిక సేవలో నిమ‌గ్నం

Aware Madhavan : ఎవ‌రీ మాధ‌వ‌న్ అనుకుంటున్నారా. సామాజిక సేవ‌కు త‌న జీవితాన్ని అంకితం చేసిన వ్య‌క్తి. అవేర్ సంస్థ‌ను స్థాపించి వివ‌క్ష‌కు, అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉన్న పేద‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. గిరిజ‌నులు, హ‌రిజ‌నులు , స‌మాజంలోని అత్యంత పేద‌ల అభ్యున్న‌తి కోసం అహ‌ర‌హం కృషి చేశారు మాధ‌వ‌న్. సేవ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయ‌న స్వ‌స్థ‌లం కేర‌ళ(Kerala). పీజీ చ‌దివారు. సివిల్ స‌ర్వీస్ లో చేరారు. కొద్దికాలం పాటు ప్ర‌భుత్వ కొలువు చేశారు. ఎక్క‌డో అసంతృప్తి. ఇదే ఆయ‌న‌ను స‌న్యాసిగా మారేలా చేసింది. హిమాల‌య ప‌ర్వ‌తాల‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డే నాలుగు ఏళ్లు గ‌డిపాడు. త‌ను కోల్పోయింది ఏమిటో తెలుసుకున్నారు మాధ‌వ‌న్. సేవ చేయ‌డంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ ఉండ‌ద‌ని న‌మ్మారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న ధ్యానం పై ఫోక‌స్ పెట్టారు. దానిని అభ్య‌సించ‌డం ఒకింత ఆనందాన్ని క‌లిగించేలా చేసింది. ఇదే ప్ర‌యాణంలో ఆధ్యాత్మిక గురువుల‌ను, స్వాముల‌ను క‌లుసుకున్నారు. భార‌తీయ ఇతిహాసాల‌ను చ‌దివే ప్ర‌య‌త్నం చేశారు. త‌ల్లి ఒత్తిడితో తిరిగి పేరెంట్స్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. మాన‌వ శాస్త్రంలో డాక్ట‌రేట్ పొందారు మాధ‌వ‌న్.

రీసెర్చ్ లో భాగంగా 1975లో ఆదిత తెగ‌ల గురించి పుస్త‌కాన్ని రాయాల‌ని సంక‌ల్పించి ఉమ్మ‌డి ఏపీకి వ‌చ్చారు. గిరిజనులు , ఆదివాసీలు ప‌డుతున్న క‌ష్టాల‌ను చూసి చ‌లించి పోయారు మాధ‌వ‌న్. పేద‌రికం, దోపిడీ చూసి కంట త‌డి పెట్టారు. వ‌డ్డీ వ్యాపారుల మోసాన్ని క‌ళ్లారా చూశాడు. ఆరోజు ఇక పుస్త‌కం రాయ‌కూడ‌ద‌ని దోపిడీ, మోసం నుంచి పేద‌ల‌ను విముక్తం చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం అవేర్ సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. ఇది గ్రామీణ ప్రాంతాల‌ను చైత‌న్య‌వంతం చేసే ప‌నిలో ప‌డింది. సామాజిక వేత్త‌గా, కార్య‌క‌ర్త‌గా, ఫోటో గ్రాఫ‌ర్ గా, ఆర్కిటెక్ట్ గా , ఆధ్యాత్మిక వేత్త‌గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు మాధ‌వ‌న్. పేద‌ల‌తో ఉంటూ వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట ప‌డేలా చేయ‌డంలో కృషి చేశారు.

ఇదే స‌మ‌యంలో పేద‌ల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు ఓపిక , స్థైర్యం ఆధ్యాత్మిక‌తో ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిందంటారు. కాంటెంప‌ర‌రీ రిలీజియ‌న్ ఇన్ మోడ‌ర్న్ వ‌ర‌ల్డ్ అనే అంశంపై మాధ‌వ‌న్(Madhavan) చేసిన కృషికి డాక్ట‌రేట్ కూడా అందుకున్నారు. ఆయ‌నను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసిన వ్య‌క్తి గాంధీ. చిన్న మొక్క‌గా ప్రారంభ‌మైన అవేర్ సంస్థ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగింది. ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌, ఒరిస్సా, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ , ఉత్త‌రాంచ‌ల్, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, యూపీలో 8 వేల‌కు పైగా ప‌ల్లెల్లో కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మై ఉంది. బ‌డులు, ఆస్ప‌త్రులు, మ‌హిళా సంఘాలు, యువ‌జ‌న సంఘాలు..ఇలా ప్ర‌తి చోటా అవేర్ ప‌ని చేస్తోంది. వ్య‌వ‌సాయం, మహిళా అభివృద్ది, మాన‌వ హ‌క్కులు, ఉపాధి, విద్య , త‌దిత‌ర ప్ర‌ధాన రంగాల‌పై ఫోక‌స్ పెట్టింది.

మాధ‌వ‌న్(Madhavan) అనేక ఉద్య‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. 1988లో 2 ల‌క్ష‌ల మంది గిరిజనులు, ద‌ళితుల ఉద్య‌మానికి నేతృత్వం వ‌హించారు. ఆయ‌న పోరాటం వ‌ల్ల 6 ల‌క్ష‌ల ఎక‌రాల గిరిజ‌న భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. 1989లో రెండున్న‌ర ల‌క్ష‌ల భూమి లేని వారి గురించి స‌ద‌స్సు ఏర్పాటు చేశారు. అదే జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి దోహ‌ద ప‌డేలా చేసింది. కార్మికుల హ‌క్కుల కోసం ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న‌పై ప‌లుమార్లు దాడులు కూడా జ‌రిగాయి. కానీ తృటిలో త‌ప్పించుకున్నారు. మాధ‌వ‌న్ ను పేద‌లు , బాధితులు మాధ‌వంజీ అని పిలుచుకుంటారు. ఎందుకంటే సేవ‌కు మించిన స్పూర్తి ఇంకెక్క‌డా లేదంటారు. అవును క‌దూ..

Also Read : Tulasi Reddy Slams : మోదీ..జ‌గ‌న్ ఇద్ద‌రూ ఒక్క‌టే

 

1 Comment
  1. Dr Hari Ramesh says

    Super sir

Leave A Reply

Your Email Id will not be published!