న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. యువతకు ఇచ్చిన హామీల అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని, తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించింది. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేక పోతే మరోసారి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని పేర్కొంది సీజేపీ. ఈ హామీల కారణంగానే గతంలో జూలై 25న తన దేశవ్యాప్త ఆందోళనను విరమించాల్సి వచ్చిందనని తెలిపింది. ప్రధానంగా విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ లేదా రద్దు, అలాగే మరణించిన నీట్ బాధితుల కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై ఇచ్చిన హామీలు ఇందులో ఉన్నాయి. యువ పౌరులకు ఇచ్చిన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పార్టీ ఈ రోజు కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల సమగ్ర జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న తన అసాధారణ అధికారాలను ఉపయోగించి కోర్టు ఆ ఎఫ్‌ఐఆర్‌లను ఏకకాలంలో రద్దు చేసే అవకాశం ఉండేది. అయితే ఆ జాబితాను అందించడానికి ప్రభుత్వం అంగీకరించ లేదని వాపోయారు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.
తమ గత ఆందోళన విరమణ తర్వాత ఇచ్చిన కీలక హామీల నుండి ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మా సద్భావనను బలహీనతగా భావించ వద్దని ఆయన హెచ్చరించారు.
