టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో కొన‌సాగుతున్న ర‌ద్దీ

3 రోజుల్లోనే కోటి నలభై లక్షల మంది ప్రయాణం

హైద‌రాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ప్రత్యేక బస్సు సర్వీసులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దసరా పండుగ రద్దీ నిర్వహణ , అదనపు బస్సుల ఆపరేషన్లపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సర్వీసులను నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఈ దసరా పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో సర్వీసులను నడుపుతూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించిందని తెలిపారు ఎండీ. గత ఏడాది (2025) దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులను నడపగా ఈ ఏడాది అక్టోబర్ 9, 10, 11 తేదీలలో గతంతో పోలిస్తే 495 బస్సులు అదనంగా, అంటే మొత్తం 1,417 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.

అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా దసరా పండుగ వేళ మహిళలకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంద‌ని తెలిపారు. గత ఏడాది దసరా సమయంలో రోజుకు సగటున రూ. 13.02 కోట్లు ఆదా కాగా, ఈ ఏడాది దసరా రద్దీ సమయంలో మహిళలు రోజుకు రూ. 13.73 కోట్ల మేర ఆదా అయ్యింద‌న్నారు ఎండీ. పండుగ ముందు రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వంత ఊర్లకు ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని అధికారులను ఎండీ వై. నాగిరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ , ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించు కోవచ్చని, ఇతర వివరాలు , ప్రయాణ సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!