#FarmersProtest : గ‌ణ‌తంత్రం.. ర‌ణ‌రంగం.. ఎవ‌రిది ఈ పాపం..?

ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం

Farmers Protest  : ఈ దేశం ఎటు పోతోంది. ఏ రాజ్యాంగం ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌య్యారో వారు త‌మ మూలాల‌ను మ‌రిచి పోతే ఇలాగే అవుతుంది. వ్య‌క్తులైనా వ్య‌వ‌స్థ‌లైనా లేక సంస్థ‌లైనా అన్నీ చూస్తే వేర్వేరుగా అనిపిస్తాయి. కానీ ఏదానికి అదే. ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్యానికి ప్రాతిప‌దిక‌గా చూపించే మ‌న దేశం ఇపుడు ఎందుక‌ని వింత పోక‌డ‌లు పోతోంది. ఇదేనా డెమోక్ర‌సీ అంటే. కాదు వాళ్లు నేర‌స్థులు కారు.

వాళ్లు టెర్ర‌రిస్టులు అంత‌కంటే కాదు. వాళ్లు క‌ళ్ల ముందు ఈ దేశం సాక్షిగా. ఈ నేల సాక్షిగా..ఈ ఆకాశం సాక్షిగా బ‌తుకుతున్న వాళ్లు. పిడికెడు అన్నం దొర‌క‌క కాలే క‌డుపుల‌తో రాలిపోతున్న వారు ఈ లోకంలో ఎందరో. మ‌రి అలాంటి అక్ష‌య‌పాత్ర లాంటి అన్నాన్ని ప్ర‌సాదించే నిజ‌మైన దేవుళ్లు వాళ్లు. ఏ ప్రభుత్వాన్ని ఆస‌రాగా చేసుకుని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో. ఆ చ‌ట్టాలు త‌యారు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించిన మ‌నుషుల్ని మ‌రిచి పోతే ఎలా.

ఎన్నిక‌ల‌ను మేనేజ్ చేయొచ్చు. వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయొచ్చు. కంపెనీలతో ములాఖ‌త్ కావ‌చ్చు. వారి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డం కోసం భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అత్యంత కీల‌క భూమిక‌ను పోషించే అన్న‌దాత‌ల ప‌ట్ల వివ‌క్ష పూరితంగా ప్ర‌వ‌ర్తించ‌డం బాధాక‌రం. హింస మా అభిమ‌తం కాదు. ద్వేషం మా డీఎన్ ఏలో లేదు. మాకు క‌ష్ట‌ప‌డ‌టం త‌ప్ప మోసం చేయ‌డం తెలీదంటున్నారు రైత‌న్న‌లు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా 71 ఏళ్లు పూర్త‌యి 72వ ఏట అడుగిడుతున్న వేళ‌. మ‌ట్టిని న‌మ్ముకుని..నేల‌తో స‌హ‌వాసం చేసి..భూమిలో బంగారాన్ని పండించే వీళ్ల‌కు మోసాలు తెలుస్తాయ‌ని అనుకోలేం. అన్నం పెట్టే వాళ్లు హింస‌కు పాల్ప‌డ‌రు అన్న యోగేంద్ర యాద‌వ్ అన్న దాంట్లో వాస్త‌వం ఉన్న‌ది. దానిని ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. కేంద్రం ఆపాదిస్తున్న‌ట్లు వాళ్లు హింస‌కు పాల్ప‌డే వాళ్ల‌యితే 76 మంది చ‌నిపోయి ఉండే వాళ్లు కాదు. ఎవ‌రైనా బ‌త‌కాల‌ని కోరుకుంటారు కానీ ప్రాణం తీసుకోవాల‌ని అనుకోరు.

ఒక‌టా రెండా ఏకంగా రెండు నెల‌లు పూర్త‌య్యాయి రైతుల ఆందోళ‌న‌. కిసాన్ ర్యాలీకి వేలాదిగా వ‌స్తార‌ని ఆశించిన వాళ్ల‌కు దిమ్మ తిరిగేలా లక్ష‌లాది మంది స్వ‌చ్చందంగా త‌ర‌లి వ‌చ్చారు. వాళ్లు ఏనాడూ విధ్వంసాల‌కు పాల్ప‌డిన‌ట్లు దాఖ‌లాలు లేవు. ఏ ఒక్క సంఘ‌ట‌నా లేదు. లాఠీలు ఝులిపించినా తట్టుకున్నారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించినా కిమ్మ‌న లేదు. వాళ్ల‌ను చూసి దేశం నివ్వెర పోతోంది. రైతుల ప‌ట్టుద‌ల ముందు రిప‌బ్లిక్ దినోత్స‌వం చిన్న పోయింది. ఇది జాతి ప‌ట్ల గౌర‌వం ఉండి చెబుతున్న మాట‌.

క‌ళాకారులు, క‌వులు, గాయ‌కులు, సామాజిక వేత్త‌లు, మేధావులు, బుద్ధి జీవులు, జ‌ర్న‌లిస్టులు, చింత‌నా ప‌రులు, స్వ‌చ్చంధ సేవ‌కులు, భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను ప్రేమించే విద్యార్థులు సైతం రైతులకు మ‌ద్ధ‌తుగా త‌ర‌లి వ‌చ్చారు.
వ్య‌వసాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ఈ దేశానికి లాభం త‌ప్ప న‌ష్టం చేకూర‌ద‌ని కొంద‌రి అభిప్రాయం. ప్ర‌భుత్వం ఇలాగే త‌న మొండి ప‌ట్టు వీడ‌క పోతే భారీగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. కానీ ఇవాళ జ‌రిగిన సంఘ‌ట‌న ఈ దేశానికి..స‌మున్న‌త భార‌తావ‌నికి ఒక హెచ్చ‌రిక లాంటిది.

ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాదు..రాజ్యాంగం శాశ్వ‌తం. పోల్ మేనేజ్ మెంట్ సిస్టం, ప‌బ్లిసిటీ, డిజిట‌ల్ మీడియా ఇవ‌న్నీ వాళ్ల‌కు తెలియ‌క పోవ‌చ్చు. కానీ వాళ్లు దేశాన్ని బ‌లోపేతం చేయ‌డంలో భాగ‌స్వాములు కాగ‌ల‌రు. వాళ్లు రాకుండా అడ్డుకోవాల‌ని చూశారు. అన్నింటిని దాటుకుని వ‌చ్చారు. ఎర్ర కోట‌పై త‌మ జెండా ఎగుర వేశారు. ఇది చాల‌దా వారు ఎంత కోల్పోయారో తెలుసు కోవ‌డానికి. మేము ప‌డుతున్న బాధ‌ల‌ను నీవైనా అర్థం చేసుకుని నీ కొడుక్కి చెప్ప‌మ్మా అంటూ ఓ రైతు ఆవేద‌న‌తో రాసిన లేఖ చ‌దివితే బాగుండు.

చ‌ట్టాలు ర‌ద్దు చేసేంత దాకా మేం విశ్ర‌మించ‌మంటున్నారు రైతులు. ఎంత మంది చ‌నిపోయినా మేం ప‌ట్టించుకోమంటే మాత్రం మాన‌వ‌త్వం అనిపించుకోదు. ఓ రైతు అన్న‌ట్టు మేం చ‌నిపోయినా మా వార‌సులు పోరాటం చేస్తారు. మా ఆశ‌యాల‌ను వాళ్లు నిజం చేస్తారన్న వ్యాఖ్యాలు వాళ్ల ప‌ట్టుద‌ల‌ను సూచిస్తున్నాయి. ప్ర‌జాస్వామ్యం బ‌త‌కాలి. బ‌తికించేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. లేక పోతే అది అరాచ‌క‌మ‌వుతుంది. మ‌న‌ల్ని నామ రూపాలు లేకుండా చేస్తుంది.

No comment allowed please