న్యూఢిల్లీ : తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తోందని, దీని ద్వారా సామాజిక అంతరాలు లేని విద్య ప్రతి ఒక్కరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, అధికారులైనా తమ రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కూల్స్ చూడాలంటే తాము సంతోషంగా చూపిస్తామని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని చెప్పారు. తయారీ రంగం, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.