అమరావతి : దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్ లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం ప్రఖ్యాత గాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సవిత సమక్షంతో డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. బీసీలను అన్ని రంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా బీసీల కులాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీ యువత ఉన్నత స్థానాల్లో కొలువు దీరాలన్న ఉద్దేశంతో సివిల్స్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్ 1, పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు.
సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 మోడల్ లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ అందించడానికి దేశంలో ప్రఖ్యాత గాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సివిల్స్ శిక్షణ సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య అకాడమీ మెటీరియళ్లతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో వివిధ సబ్జెక్టులపై బోధన అందించనున్నారన్నారు. 2014-19లో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఉచిత సివిల్స్ కోచింగ్ నిలిపేసిందన్నారు. దీంతో బీసీ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పాలైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత సివిల్స్ కోచింగ్ ను పునరుద్ధించిందన్నారు. గడిచిన రెండేళ్లలో 200 మందికి ఉచిత సివిల్స్ కోచింగ్ అంజేశామన్నారు. 2025 మెగా డీఎస్సీకి, గ్రూప్ 1కు కూడా ఉచిత శిక్షణ అందజేసినట్లు తెలిపారు ఎస్. సవిత. త్వరలో సివిల్స్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నామన్నారు. ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వంద మందికి ఉచిత వసతితో కూడిన శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు.
