స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి

పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేసిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా : వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌వాల్ గా తీసుకోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న రెండు రోజుల పాటు పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలని ఆదేశించారు . అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడితే గట్టిగా ఎదుర్కోవాలని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌పై ఉంద‌న్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను జగన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు పలు సూచనలు చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని సూచించారు. ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉండేలా ముందుగానే సన్నద్ధం కావాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించు కోవాలని సూచించారు.

అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకు రావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు స్ప‌ష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు.ప్రజల మధ్యే ఉండాలి. వారి సమస్యలపై పోరాడాలి. వైఎస్సార్‌సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం కాదని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!