అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలను ఇస్తోందని , ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని అన్నారు. ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఏపీ సర్కార్ చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం అభినందించినట్లు తెలిపారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10 శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుందన్నారు. 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పని చేయాలని మంత్రి కోరారు. 2027 మార్చినాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27 లక్షల మంది అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
ఇందుకోసం 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి, పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది ఇంటర్మిడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మడియట్ లో సుమారు 10 వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించేలా రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికే రూ.1051 కోట్ల మేర ఆర్థిక సాయం అందించగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు త్వరలో అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి నూరు శాతం అపార్ ఐడి ఇంటిగ్రేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
