టీటీడీ ఆలయాల్లో వైభవంగా గోకులాష్టమి వేడుకలు

సెప్టెంబరు 5న భక్తి శ్రద్ధలతో ఉట్లోత్సవం

తిరుమ‌ల : శ్రీకృష్ణ జన్మోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ, వాహనసేవ, గోపూజ, ఆస్థానం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినమైన గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలోని పలు స్థానిక ఆలయాల్లో 4న భక్తిశ్రద్ధలతో వైభవంగా వేడుకలు జ‌రుగుతాయ‌ని తెలిపింది. 5న ఆయా ఆలయాల్లో ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామ‌ని పేర్కొంది. తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, కపిల తీర్థం వద్దనున్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, నారాయణవనం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్న‌ట్లు తెలిపింది టీటీడీ. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ, వాహనసేవ, గోపూజ, గోకులాష్టమి ఆస్థానం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయ‌ని వెల్ల‌డించింది.

గోకులాష్టమి రోజున ఉదయం శ్రీ కృష్ణ స్వామివారి మూలమూర్తులకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సవ మూర్తులకు ముఖ మండపంలో స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ నిర్వహిస్తామ‌న్నారు. సాయంత్రం 6.45 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తామ‌న్నారు. 5న ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగుతాయి. శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆల‌యంలో 4న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం, నివేదన కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపింది. కపిలతీర్థం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 4న సాయంత్రం 5 నుంచి 6.40 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించి, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. గోకులాష్టమి, ఉట్లోత్సవాలను పురస్కరించుకుని ఈ రెండు రోజుల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు . శ్రీకృష్ణుని దివ్య లీలలను స్మరిస్తూ, గోవింద నామస్మరణతో ఆలయాలు భక్తి పారవశ్యంతో మారుమోగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది.

Leave A Reply

Your Email Id will not be published!