అమరావతి : చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. చేనేత వస్త్రాల తయారీలో ముఖ్యమైన నూలును పెట్టుబడిగా రుణ రూపేణా సరఫరా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. నేతన్నలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసిన తరవాత ఆప్కో అధికారులు సరఫరా చేసిన నూలు మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేయాలన్నారు. ముందుగా నూలు అందజేయడం వల్ల నేతన్నలపై పెట్టుబడి భారం తగ్గుందని మంత్రి తెలిపారు. ఆప్కో, లేపాక్షి షో రూమల్లో చేనేత ఉత్పత్తులు, హస్త కళారూపాల విక్రయాలు పెంచాలని ఆదేశించారు. చేనేతలు, హస్త కళాకారులకు 365 రోజులూ ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో అవసరమైన చోట ఆప్కో, లేపాక్షి షో రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల ఆరో తేదీన పెనుకొండలో ఆప్కో షో రూమ్ ఏర్పాటుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో కూడా ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రానున్న పండగల నేపథ్యంలో చేనేత, హస్త కళలపై డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాలని మంత్రి సవిత తెలిపారు. ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయిదేళ్లలో రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో తెలిపిందన్నారు మంత్రి ఎస్. సవిత. ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి యూనిట్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు సీఈవో సింహాచలం, లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
