చెన్నై : తమిళనాడు టీవీకే సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, శీతలీకరణ ,సేకరణ ప్రక్రియలో ఆటోమేషన్‌ను పెంచేందుకు గాను పథకాలను ప్రకటించింది. రోగులకు స్వచ్ఛమైన , పోషకమైన పాలను అందించడానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులలో ‘ఆవిన్’ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తామని మంత్రి విజయలక్ష్మి తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించడం, పాల ఉత్పత్తిని పెంచడం, నాణ్యతను కాపాడేందుకు శీతలీకరణ (కూలెంట్) సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి తావులేకుండా పాల సేకరణ ప్రక్రియను పూర్తిగా ఆటోమేట్ చేయడం వంటి చర్యలను ప్రకటించారు. అసెంబ్లీలో తన శాఖకు సంబంధించిన నిధుల కేటాయింపు డిమాండ్‌పై సమాధానం ఇచ్చారు.
వినియోగదారులకు రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలను ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తున్న అంబత్తూరు పాల డైరీలో, ‘హోమోజనైజర్’ యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రూ. 2 కోట్ల వ్యయంతో ఆధునీకరణ చేపడతామని ఆమె తెలిపారు. పాల సేకరణ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ‘ఎండ్-టు-ఎండ్’ ఆటోమేషన్‌ను అమలు చేస్తామని ఆమె ప్రకటించారు. జెర్సీ ఆవుల పునరుత్పత్తి వయస్సును తగ్గించడానికి మరియు దూడల శారీరక ఎదుగుదలను మెరుగుపరచడానికి రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో ఒక కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఈ పథకం కింద జెర్సీ దూడలకు సమతుల్య పశుగ్రాసం, పేగుల్లోని నులిపురుగుల నివారణకు మందులు, ఖనిజ లవణాలు (మినరల్ సాల్ట్స్) అందించనున్నట్లు పేర్కొన్నారు. పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో, జెర్సీ రకం కాకుండా ఇతర ఆవులలోని సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించడానికి రూ. 10 కోట్ల బడ్జెట్‌తో మరో కార్యక్రమాన్ని కూడా ఆమె ప్రకటించారు.
సంతానోత్పత్తి సమస్యలు ఉన్న ఆవులను గుర్తించి, వాటి లోపాలను సరిదిద్దడంతో పాటు పోషకమైన పశుగ్రాసాన్ని అందిస్తామన్నారు. పాల ఉత్పత్తిదారుల ఆర్థిక నష్టాలను తగ్గించడం , వారి జీవనోపాధిని మెరుగు పరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు విజయలక్ష్మి. పాలను నిల్వ చేయడానికి , వాటి నాణ్యత, భద్రత దెబ్బతినకుండా చూసేందుకు భారీ ఖర్చుతో 60 బల్క్ మిల్క్ కూలర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే శీతలీకరణ సదుపాయాలతో కూడిన 40 భవనాలను నిర్మిస్తామని ఆమె తెలిపారు. దీని కోసం రూ. 25 కోట్లు కేటాయించామన్నారు.
