హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు రాష్ట్ర సర్కార్ పై. రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. ఓ వైపు వేదికలపై ఆర్టీసీ లాభాల బాటలో ఉందని అబద్దాలు చెబుతున్నాడని, మరో వైపు ఆర్టీసీ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి రూ. 2,600 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని స్వయంగా ఆర్టీసీ సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు. పాలన గాడి తప్పిందని, సీఎంగా రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు హరీష్ రావు.
కాగితాల మీద ఆర్టీసీ లాభాల్లో ఉందని చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్యోగులు , పదవీ విరమణ పొందిన కార్మికుల జీవితాలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటాల ప్రభుత్వం తప్పా మరోటి కాదన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడం వల్ల ఉద్యోగులకు పీఆర్సీ , బకాయిలు అందడం లేదన్నారు. 30-40 ఏళ్లపాటు ఆర్టీసీకి సేవలు అందించిన సుమారు 18,000 మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు నేటికీ వారి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక పోవడం అత్యంత బాధాకరం అన్నారు.
తమ జీవితకాల సేవలకు ప్రతిఫలంగా రావాల్సిన డబ్బు కోసం వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తన్నీరు హరీష్ రావు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికే 400 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో ఆవేదన కలిగిస్తోందన్నారు. పెన్షన్ సదుపాయం లేని ఈ రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలే చివరి ఆధారం అన్నారు. ఆ చివరి ఆధారాన్ని కూడా వారికి నిరాకరించడం కాంగ్రెస్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి పరాకాష్ట అని ఆవేదన చెందారు.
