ఓటర్ల జాబితా నుండి రాఘవ్ చద్దా పేరు తొలగింపు

ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆరోపణ

న్యూఢిల్లీ : పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును పొరపాటుగా మరొక ప్రాంతానికి మారినట్లు వర్గీకరించారని బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. దీని వెనుక పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్య ఉందని ఆయన విమర్శించారు. తాను పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ ఎంపీనని, తన ఓటర్ ఐడి మొహాలీలో నమోదై ఉందని, అయినప్పటికీ ముసాయిదా జాబితాలో తన పేరును మరొక ప్రాంతానికి మారినట్లు చూపించారని చద్దా తెలిపారు. తుది ఓటర్ల జాబితా ఇంకా విడుదల కాలేదని, ప్రస్తుతం జరుగుతున్న ‘అభ్యంతరాలు , క్లెయిమ్‌ల’ ప్రక్రియలో పేర్లను సరిదిద్దుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ మార్గదర్శకాల ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలను తాను ఇప్పటికే వినియోగించు కుంటున్నట్లు చ‌ద్దా పేర్కొన్నారు.

పంజాబ్ లో ఉన్న ఆప్ ప్రభుత్వం తన ప్రతీకార రాజకీయాలను ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ వరకు తీసుకువెళ్లిందని ఆరోపించారు; ఈ వర్గీకరణ స్పష్టమైన రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పంజాబ్ ప్రభుత్వ అధికారులు వివిధ స్థాయిలలో ప్రమేయం కలిగి ఉన్నారని చద్దా ఆరోపించారు. తన విషయంలో నిబంధనలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారని మండిపడ్డారు ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా. ముసాయిదా ఓటర్ల జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తి కాదని స్పష్టం చేశారు. ఆప్ నుండి బీజేపీలో చేరిన ఇతర ఎంపీలను కూడా పంజాబ్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారత ఎన్నికల సంఘం స‌ర్ మార్గదర్శకాలలోని పేరా 4(డి)ని చద్దా ప్రస్తావించారు. న్యాయమూర్తులు, ఎంపీలు , ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధుల కోసం ఈ నిబంధన ఒక రక్షిత జాబితా ను ఏర్పాటు చేస్తుందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!