హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది ఆర్టీసీ సంస్థ యాజమాన్యం. మరోవైపు 24 గంటలు తన తలుపులు తెరుచుకునే ఉంటాయని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పత్తా లేకుండా పోయాడని జేఏసీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. మరో వైపు ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇదే క్రమంలో ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్దమన్నారు. సమ్మె కారణంగా వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.
ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. సమ్మె చేయడం మంచి పద్దతి కాదని, కార్మికులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 ప్రకారం సమ్మెలో పాల్గొని విధులకు హాజరు కాకపోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్థ ప్రయాణికుల సేవే పరమావధిగా పని చేస్తోందన్నారు. ఇటీవల వివిధ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులపై స్పందించారు. కార్మిక శాఖ, యాజమాన్యం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో చర్చల ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఈ తరుణంలో కార్మికులందరూ ఈ క్రింది ముఖ్యమైన చట్టపరమైన అంశాలను గమనించాలని కోరారు ఎండీ నాగిరెడ్డి.పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 22(1)(d) ప్రకారం, సంబంధిత అధికారి (Conciliation Officer) వద్ద ఒక వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం అని హెచ్చరించారు ఎండీ.
