తిరుమల : తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామి వారి దర్శనానికి తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని స్పష్టం చేసింది టీటీడీ. అసత్య కథనాలు ప్రసారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించింది. తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామి వారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు సంయమనంతో వేచి ఉండాలని భక్తులను కోరింది. వేసవి సెలవులకు తోడు వారాంతం కూడా రావడంతో శనివారం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక చానెల్ ఉద్దేశ పూర్వకంగా క్యూలైన్లలోని భక్తులను రెచ్చగొట్టి బైట్స్ తీసుకోవడాన్ని టీటీడీ ఖండిస్తోంది.
సర్వ దర్శన క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడం జరుగుతోంది. భక్తులకు అన్నీ సౌకర్యాలు కల్పించడం కోసం టీటీడీ యంత్రాంగం, శ్రీవారి సేవకులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వాస్తవానికి ఉదయం సర్వ దర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించిన వారు ముందుకు కదులుతున్న సమయంలో క్యూలైన్లలోని భక్తులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం బైట్లు తీసుకుని ప్రచారం చేయడాన్ని టీటీడీ ఆక్షేపిస్తోంది .భక్తుల రద్దీని అదునుగా చూసుకుని క్యూలైన్లలోని భక్తుల వద్దకు వెళ్లి ఉద్దేశ పూర్వకంగా వారిని రెచ్చగొట్టి దర్శనం ఆలస్యం అవుతోందని చెప్పించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.
శ్రీవారి దర్శనానికి అందుబాటులో ఉండే దర్శన సమయం, పరిమితులను దృష్టిలో ఉంచుకుని భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని సదరు చానెల్ కు సూచించడం జరుగుతోంది. ఈ సందర్భంగా అసత్య కథనాల కోసం ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
