తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారు పద్మసరోవరంలోని సుందరంగా అలంకరించిన తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.ఉదయం సుప్రభాతంతో ప్రారంభమైన నిత్య కైంకర్యాల అనంతరం మధ్యాహ్నం శ్రీ కృష్ణ స్వామివారి ముఖ మండపంలో స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన ఈ పవిత్ర అభిషేకం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది
సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ పద్మ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు జరిగిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పద్మ సరోవరంలో విద్యుద్దీపాల వెలుగుల్లో సాగిన ఈ దివ్య విహారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెప్పోత్సవం అనంతరం శ్రీ కృష్ణస్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కరుణాకటాక్షాలతో అనుగ్రహించారు. తెప్పోత్సవాలలో భాగంగా ఆలయ నాలుగు మాడవీధుల్లో నిర్వహించిన భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామ స్మరణలతో పాటు సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో హరింధ్రనాథ్, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
