నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు

ఇస్తామ‌న్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా, సకాలంలో సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశ పెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుంచి కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో APAIMS 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ చేపట్టామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2,97,733 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ విజయవంతంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అమలు చేస్తోందన్నారు. దీనివల్ల అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు అందేలా పూర్తి భరోసా కల్పించామని మంత్రి పేర్కొన్నారు.

రైతు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిమాణంలోనే ఎరువులు అందజేస్తున్నామని తెలిపరు అచ్చెన్నాయుడు. దీంతో సమతుల్య ఎరువుల వినియోగం పెరిగి, రైతులకు దిగుబడులు మెరుగు పడటంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా సక్రమంగా వినియోగమవుతుందని చెప్పారు. APAIMS 2.0 ద్వారా ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, మళ్లింపులు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాలు పూర్తిగా అరికట్టే అవకాశం లభించిందన్నారు. ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా రియల్‌టైమ్ పర్యవేక్షణ సాధ్యమవుతోందని అన్నారు మంత్రి. iFMS, APAIMS, భౌతిక నిల్వల సమన్వయంతో ఖచ్చితమైన నిల్వల నిర్వహణ జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా, అవసరమైన సమయంలో అవసరమైన పరిమాణంలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతుకు సమాన అవకాశాలు కల్పించేలా ఈ వ్యవస్థ రూపొందించ బడిందని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 155251 కు కాల్ చేయవచ్చని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!