అమరావతి : రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనామిక్ రీజియన్లో నివసిస్తున్నారని… భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉందని పేర్కొంది ఏపీ కూటమి ప్రభుత్వం. ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే పనిలో పడ్డారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం ఏఈఆర్కు కలిసొచ్చే అంశమని ఈ సందర్బంగా అన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం…మొత్తం 9 జిల్లాలు అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉండగా… వీటిలో అన్నింటికన్నా కృష్ణా జిల్లా తలసరి ఆదాయంలో ముందుందని చెప్పారు. జిల్లాల వారీగా రీజియన్ అభివృద్ధి జరిగేలా వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులతో పాటు…కొల్లేరు సరస్సును రీజియన్ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.
ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్ వరకు…ఫుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకు ఉన్న అనుకూలతను మార్కెటింగ్ చేసుకోవాలని సీఎం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే పెద్దఎత్తున పెట్టుబడులు… తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీ పడేలా తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి జరగాలన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఐఐటీ వంటి విద్యా సంస్థలు, గోల్డ్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ వంటి ఖనిజ వనరులు రాయలసీమ అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. గండికోట, హార్సిలీహిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రాంతాలను ఇంటిగ్రేట్ చేయాలన్నారు.
