అమరావతి : ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని పేర్కొన్నారు. .25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్‌కు ఉందని…తిరుపతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్‌లో రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో రూ.60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని అధికారులకు సీఎం చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా…సీమలోని ఓ మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండటాన్ని అధ్యయనం చేయాలని సీఎం అన్నారు.
కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు రూ. 7.30 లక్షలు తలసరి ఆదాయం కలిగి ఉండడం హార్టికల్చర్ పంటల సాగు వల్ల కలిగే లాభాలకు నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు. హార్టికల్చర్ కు అత్యంత అనువైన రాయలసీమలో ఆ దిశగా ప్రజలను మరింత ప్రోత్సహించాలన్నారు. సీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తీసుకువస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారుతాయని సిఎం అన్నారు. ఆ దిశగా జిల్లా అధికారుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రణాళికతో పని చేయాలన్నారు. సచివాలయంలో రాష్ట్రంలోని మూడు ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు. ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక ఆవిష్కరించగా…6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాక ముసాయిదాను ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. రెండు నెలల్లో డిస్ట్రిక్ట్ ఎకనమిక్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు ఏ రంగాల్లో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
