అమరావతి : సముద్రంలో బోటు తిరగబడిన ఘటనలో వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ లో కర్రి చిన్నాను ఐఎన్ఎస్ డేగాకు అధికారులు తరలించారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లతో పాటు కోస్టు గార్డు నౌకలు, మెరైన్ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో వాణిజ్య నౌక ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న మత్స్సకారుడిని ఒడ్డుకు తరలించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మిగిలిన 6గురు మత్స్యకారుల గాలింపు చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు.
బోటు బోల్తా పడిన గంగవరం పరిసర ప్రాంతాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో నౌకాదళ హెలికాప్టర్లతో గాలింపు విస్తృతం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి రెండు యుద్ధ నౌకలతో పాటు రెండు హెలికాప్టర్లు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టాయని తీరప్రాంత భద్రత విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి కారణంగా సముద్రంలో అలల తీవ్రత, బలమైన గాలులతో గాలింపు చర్యలకు విఘాతం కలుగుతోందని సీఎంకు తెలిపారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీని త్వరితగతిన కనిపెట్టాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు బాసటగా నిలబడాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు తనకు తెలియ చేయాలని సీఎం అన్నారు.
