అమరావతి : ఆప్కో స్వర్ణోత్సవం సందర్భంగా నేతన్నలకు, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వరాల జల్లు కురిపించారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందన్నారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన రూ.4 కోట్లు, వచ్చే నెల మొదటివారంలో మరో రూ.2.50 కోట్లు బకాయిలు అందజేయనున్నామని ప్రకటించారు. నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందజేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఆప్కో బలోపేతానికి చర్యలు తీసుకున్నామన్నారు. మంగళగిరిలోని ఆప్కో తోటలో ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
సవిత మాట్లాడుతూ తాను చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆప్కో స్వర్ణోత్సవాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏ లక్ష్య సాధనకు ఆప్కోను ఏర్పాటు చేశారో ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కష్ట పడుతున్నారన్నారు. అన్న ఎన్టీఆర్ జనతా వస్త్రాల పేరుతో చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే, ఏపీ చేనేత రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళుతున్నారన్నారు ఎస్. సవిత. ఆప్కోలో చేపట్టిన డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు. ఆప్కోను లాభాల పట్టేలా ప్రక్షాళన చేపట్టామన్నారు.
