అమరావతి : ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలంటూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆ ముగ్గురూ బ్రాండ్ అంబాసిడర్లగా వ్యవహరిస్తున్నట్లు ప్రశంసలు కురిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగానికి మరోసారి స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. చేనేతలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామని చెప్పారు. ఏటా త్రిఫ్డ్ ఫండ్ కింద రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయించినట్లు తెలిపారు. 15 శాతం సబ్సిడీతో నూలు అందజేస్తున్నామని చెప్పారు.
నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందజేసే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆప్కో చరిత్రలో మొట్ట మొదటిసారిగా టీటీడీతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన చేనేత సహకార సంఘాలు ముందుకొస్తే… టీటీడీకి అవసరమైన దుశ్శాలువాలు, చీరలు, జాకెట్లు, కండువాలు పంపిణీ చేసే ఆర్డర్ ఇస్తామని మంత్రి సవిత ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత సహకార సంఘలా ప్రతినిధులను మంత్రి సవిత సత్కరించారు. ఆప్కోలో పనిచేసే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.1.20 లక్షల విలువ చేసే బెనిఫిట్స్ ను చెక్ రూపంలో మంత్రి సవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ప్రతినిధులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వర్, ఆకాశపు స్వామి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ధనుంజయ రావు, పెద్ద సంఖ్యలో నేతన్నలు, పాల్గొన్నారు.
