PM Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ, అమిత్ షా వరుస భేటీలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ, అమిత్ షా వరుస భేటీలు
PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటల వ్యవధిలో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో వేర్వేరుగా రాష్ట్రపతి భవన్ లో సమావేశమయ్యారు. అయితే ఈ వరుస భేటీలపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడకపోయినప్పటికీ… పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమేనంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆర్టికల్ 370ని రద్దుచేసి ఆరేళ్లు పూర్తవుతున్న తరుణంలో జరిగిన భేటీలతో ఈ తరహా చర్చ మొదలైంది.
PM Narendra Modi Meet
బ్రిటన్, మాల్దీవుల పర్యటన తర్వాత రాష్ట్రపతిని ప్రధాని మోదీ (PM Narendra Modi) కలవడం ఇదే తొలిసారి. తర్వాత కొన్ని గంటలకు తర్వాత అమిత్ షా కూడా ముర్ముతో సమావేశమయ్యారు. హోంమంత్రి తర్వాత జమ్మూకశ్మీర్ నేతలను వచ్చి కలిశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. సరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. కచ్చితమైన గడువు నిర్దేశించనప్పటికీ… రాష్ట్రహోదా పునరుద్ధరణకు పలుమార్లు ప్రధాని మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ హామీ ఇచ్చారు. ఇక, బిహార్ ఓటర్ల జాబితాపై జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రత్యేక చర్చ కోసం పార్లమెంటులో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అటు ప్రధాని.. ఇటు హోంమంత్రి రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు రాజ్యాంగబద్ధమేనని 2023లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ‘‘అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ.. శాశ్వతం కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది’’ అని స్పష్టం చేసింది. కాగా.. జమ్మూకశ్మీర్ కు గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా.. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఆయన డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
‘‘2014లో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాష్ట్రానికి సీఎంగా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంత సీఎంగా డిమోట్ అయ్యాను. అప్పుడు రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న వ్యక్తికి… లెఫ్టినెంట్ గవర్నర్ (LG)గా ప్రమోషన్ వచ్చింది. త్వరలో నాకు ప్రమోషన్ వస్తుందని ఆశిస్తున్నా. దీన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం పట్టదనుకుంటున్నాను’’ అని మోదీని ఒమర్ నేరుగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Also Read : Pariksha Pe Charcha 2025: గిన్నిస్ వరల్డ్ రికార్డులో ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’కు చోటు
