అమరావతి : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే హిందువులకు, ప్రజలకు జగన్, వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. కలియుగ దైవం వెంకన్న స్వామి ఫొటోలతో రాజకీయం చేయడం క్షమించరాని నేరమన్నారు. తెలుగు జాతి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఫొటోలతో ఉన్న ప్లకార్డులను మండలిలో ఇష్టారాజ్యంగా పడేసి మహా అపచారానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్ రెడ్డి సూచన మేరకే తమ రాజకీయాల కోసం శాసన మండలిలో వెంకన్న స్వామి ఫొటోలను వైసీపీ సభ్యులు వాడుకున్నారని మండిపడ్డారు. మహిళలన్నా గౌరవం లేదని, ప్రజల పట్ల బాధ్యత లేదని వైసీపీ సభ్యులపై మంత్రి సవిత మండిపడ్డారు. చివరికి దైవం పట్ల పాపభీతి కూడా లేదన్నారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి పాపం మూట కట్టుకున్నారని, ఇదే విషయం సీబీఐ వేసిన సిట్ సైతం స్పష్టం చేసిందని తెలిపారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, సభలో చర్చలకు ఆటంకం కలిగించడానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ సభ్యులు రచ్చ చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలతో పాటు తిరుపతి లడ్డూ అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా వైసీపీ సభ్యులు పట్టించుకోవడం లేదన్నారు.
