ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు టీటీడీ ఊరట

స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీకి ప్రతిపాదనలు

తిరుపతి : స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టిటిడి ఈవో ర‌విచంద్ర‌ను క‌లిశారు .తమ కోర్సు వ్యవధి 4½ సంవత్సరాలు మాత్రమే కావడంతో అదే మేరకు ఫీజులు వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను 5 సంవత్సరాలకు వసూలు చేస్తున్నట్లు వారు వినతి పత్రం సమర్పించారు.

ఈ అంశాన్ని పరిశీలించిన టిటిడి ఈవో, నేషనల్ మెడికల్ కమిషన్ 07-04-2026న జారీ చేసిన నిబంధనలను పరిశీలించి, ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కోర్సుకు ఫీజులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చర్చించి, తగిన ఆమోదం (రాటిఫికేషన్) పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం 2021-22బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతో, వారికి 5 సంవత్సరాల కంటే 4½ సంవత్సరాలకే ఫీజులు వర్తింప జేయాలని నిర్ణయించారు. ఇదే విధానం ఇకపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూడా అమలు కానుంది. ఈవో తీసుకున్న నిర్ణ‌యం తో పేరెంట్స్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లోనే స్విమ్స్ బాడీ యుద్ద ప్రాతిప‌దిక‌న స‌మావేశం కావ‌డం జ‌రుగుతుంద‌ని ఈ సంద‌ర్బంగా హామీ ఇచ్చారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌. విద్యార్థులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!