బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు ట‌చ్ లో ఉన్నారు

బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చిట్ చాట్ సంద‌ర్బంగా నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కీలక నేతలు తనతో సంప్రదింపుల్లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేల పేర్లను ఇప్పుడే బయట పెట్టనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బయటకు రాని కేటీఆర్, ఇప్పుడు పాదయాత్ర చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తనను సస్పెండ్ చేసినందుకే మొదట బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశానని వెల్లడించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇష్యూను బట్టే తన వాదన ఉంటుంద‌న్నారు. తదుపరి వ్యూహం ఉంటుందని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదే స‌మ‌యంలో బీజేపీ తీసుకు వ‌చ్చిన బిల్లు వీగి పోవ‌డంపై స్పందించారు క‌విత‌. మహిళల కోసం చేస్తున్నామంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చినా, దాన్ని డీలిమిటేషన్‌తో లింక్ చేయడం చూస్తే అసలు ఉద్దేశ్యం స్పష్టమవుతోంద‌ని అన్నారు.ముందు జనగణనతో, ఇప్పుడు డీలిమిటేషన్‌తో, ఇలా మహిళలను పదేపదే మోసం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విచిత్రం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లును డెలిమిటేషన్‌తో లింక్ చేయడం పూర్తిగా అన్యాయం అన్నారు. ఈ రెండింటికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వపు తప్పుదారి పట్టించే విధానం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

మహిళా బిల్లును ఓబీసీ రిజర్వేషన్‌తో అనుసంధానం చేయాల‌న్నారు. 33%లో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాల్సిందేన‌ని పేర్కొన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. దానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అత్యంత హేయం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చ‌రించారు. బీజేపీ ఎంపీలు మీ సహచర ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఖండించాలని లేదా మీ ప‌ద‌వుల‌కు త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!