నిర్దేశిత గడువులో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతీ చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం , విద్య) డా. ఎ. శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు . ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ప్రతి ఫ్లోర్‌లో ఒక గదిని మోడల్ యూనిట్‌గా అభివృద్ధి చేసి, ఆ గదిలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ ఎక్విప్‌మెంట్ తదితర సదుపాయాలను సమగ్ర ప్రణాళికతో ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని గదుల్లో ఆమోదిత లే అవుట్‌కు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు.

పెండింగ్ పనులను సంబంధిత విభాగాలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి గదిలో రోగి సేవలకు అవసరమైన మెడికల్ మరియు సపోర్ట్ సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రముఖ ఆసుపత్రులలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై నివేదికలు సేకరించి అమలు చేయాలని సూచించారు. అనంతరం నూతన భవనంలోని 6 అంతస్తుల గదులు, పై అంతస్తులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి సమీపంలో అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిఈ టి.వి. సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి, ఎస్.ఈలు మనోహరం, వేంకటేశ్వర్లు, డిఈ సరస్వతి, డిప్యూటీ ఈఈ హర్షవర్థన్ రెడ్డి ,తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!