తమిళనాడు : దేశంలోని తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. తమిళనాడులో ఒకే రోజు 234 శాసన సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. కానీ పశ్చిమ బెంగాల్ లో రెండు విడతులుగా పోలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈసీ. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సామాన్య పౌరులు లాగానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ నటుడు , ఇలయ నాయగన్ కమల్ హాసన్ తన కూతురు, నటి శృతి హాసన్ తో కలిసి ఓటు వినియోగించుకున్నారు. తలైవా రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని, ఖుష్బు, సుందర్ , ఇలా చాలా మంది ఓటు వేశారు.
ఇక ఈసారి ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కొత్త పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు టీవీకే విజయ్ స్వయంగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయన రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సున్నితమైన, కీలకమైన పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) వ్యవస్థలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ధృవీకరించు కోవడానికి, తెల్లవారు జామున మాక్ పోలింగ్ నిర్వహించారు. కరూర్లోని బూత్ నంబర్ 135 వద్ద, అసలు ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు.
తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలకమైన ఎన్నికల్లో మొత్తం 5.73 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులు. వివిధ రాజకీయ పార్టీలు, కట్టుదిట్టమైన పర్యవేక్షణలో రోజంతా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. మార్గదర్శకాలను పాటిస్తూ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల కమిషన్ కోరింది.
