విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ లేదు డిజిల్ లేదు అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు..రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు అని మండిపడ్డారు షర్మిలా రెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గు పడాలన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇంధన కష్టం కూటమి ప్రభుత్వం విధించిన శాపం తప్పా మరోటి కాదన్నారు.
సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ .పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు తగిలించడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు. 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణం అన్నారు. ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చో బెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరం అని పేర్కొన్నారు.
సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కొరత తీరదన్నారు. అమ్మకాలు, ఆందోళనల పేరుతో మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తే కుదరదు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు షర్మిలా రెడ్డి.
