అమరావతి/విజయవాడ : రాష్ట్రంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో “పశుసంవర్ధక మార్గదర్శిని” ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, సన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. 2025–26 సంవత్సరానికి పశుసంవర్ధక శాఖ ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం ఈ రంగ ప్రాధాన్యతను స్పష్టంగా చూపుతోందన్నారు. అయినప్పటికీ సంప్రదాయ యాజమాన్య పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యల కారణంగా ఆశించిన స్థాయి వృద్ధి సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యువత శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, అదే సమయంలో పశుసంవర్ధక రంగాన్ని వాణిజ్య సరళిలో అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పాడి పశువులు, జీవాలు, నాటు కోళ్లు, పందుల పెంపకం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు . విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందగా, అందులో సుమారు 200 మంది రైతులు వాణిజ్యపరంగా లాభసాటిగా పశుసంవర్ధక కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన “పశుసంవర్ధక మార్గదర్శిని” ఈ-మేగజైన్‌ను ఏప్రిల్ నెల నుండి [www.apahsmile.in (http://www.apahsmile.in) “స్మైల్” వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు
