మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం

మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం

అమ‌రావ‌తి : పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు అభిప్రాయపడ్డారు. మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రి 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి.వి. సింధు మాట్లాడుతూ “పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారని అన్నారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుందన్నారు.

సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారని వాపోయారు. ఈ సమస్యకు పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయన‌న్నారు. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం చూపిస్తాయ‌న్నారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంద‌న్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!