సరస్వతీ స్వరూపంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో జ్ఞానభక్తి వైభవం

తిరుప‌తి : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి అపూర్వ ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు సరస్వతీ అలంకారంలో హంస వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలు, గోవింద నామ స్మరణల మధ్య వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. వీణను ధరించి సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు భక్తులను విశేషంగా అనుగ్రహించారు. హంస మంచి, చెడులను గుర్తించి మంచిదానినే స్వీకరించే జ్ఞానానికి ప్రతీక. సరస్వతీదేవి వాహనమైన హంసపై విహరించిన స్వామివారు భక్తులు నిర్మలమైన మనస్సుతో, మంచి ఆలోచనలతో జీవించాలని, అలాంటి వారి హృదయాల్లో తాను ఎల్లప్పుడూ కొలువై ఉంటాననే దివ్య సందేశాన్ని అందించారు.

వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భజన మండళ్ల గానామృతం, కోలాటాల మధ్య సాగిన హంసవాహన సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. స్వామివారి దివ్యరూపాన్ని దర్శించిన భక్తులు గోవింద నామ స్మరణతో మాడవీధులను మారు మోగించారు. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం 8.00 గంటలకు సింహ వాహనంపై, రాత్రి 7.00 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు దివ్య మంగళ విహారం చేస్తూ భక్తులకు కరుణాకటాక్షాలు ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్.ఈ. నరసింహామూర్తి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీవాణి, సురేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!