ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం
ఆర్టీసీల పురోగతి కి సరికొత్త వ్యూహాలతో వై. నాగిరెడ్డి
ఉత్తరాఖండ్ : తెలంగాణ ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ అఖిల భారత సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేషన్ ఛైర్మన్, టీజీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి, ఐపీఎస్ అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్టీసీల ఛైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (EDలు), ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొని రవాణా రంగ పురోగతిపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ సంస్థలకు స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే వెండర్స్ తో కీలక భేటీ జరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విపరీతంగా పెరుగుతున్న స్పేర్ పార్ట్స్ ధరలను ఎలా అధిగమించాలనే అంశంపై అసోసియేషన్ ఛైర్మన్ వై. నాగిరెడ్డి కీలక సూచనలు చేశారు.
పెరిగిపోతున్న ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, ఆర్టీసీలపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కాలుష్య నివరణకు తెలంగాణలో విద్యుత్ (ఎలక్ట్రికల్) బస్సులను విజయవంతంగా నడుపుతున్నట్లు వివరించారు. విద్యుత్ బస్సుల సమర్థవంతమైన నిర్వహణలో టీజీఎస్ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అనుకూల విద్యుత్ బస్సులను తీసుకువచ్చి, హైదరాబాద్ నగరాన్ని పూర్తి కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా రవాణా రంగంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) వినియోగంలో టీజీఎస్ ఆర్టీసీ అగ్రగామిగా నిలుస్తోందని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, అంతర్గత నిర్వహణను సైతం డిజిటలైజ్ చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సంస్థకు గుండెకాయ లాంటి ఆర్టీసీ గ్యారేజీల నిర్వహణలో అధునాతన సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల ఫిట్‌నెస్, విడిభాగాల లభ్యత, మెయింటెనెన్స్ షెడ్యూళ్లను పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం ద్వారా బస్సుల సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రయాణీకులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
