హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అయ్యిందని ఆరోపించారు. లక్షల కోట్లు అప్పులు చేసి తమ నెత్తిన పెట్టారంటూ మండిపడ్డారు. అందుకే ప్రజలు ప్రజా ప్రభుత్వానికి ఓటు వేశారని గుర్తు చేశారు. కేసీఆర్ నిర్వాకం కారణంగా తమ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు సమకూరాయని, కానీ ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం పడిందని, కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు పెరిగాయి. ఇది ఎలా సాధ్యమైంది డ్రామారావు అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. అన్నింటిలో విఫలమై, తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న అవినీతి డబ్బుతో TRSను BRSగా మార్చిన మిమ్మల్ని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ప్రజాస్వామ్య స్పూర్తిని కాలరాస్తూ, ఫాంహౌస్‌కే పరిమితమైన మీ నాయకుడి తీరు చూస్తుంటే, BRSను FRS (ఫాంహౌస్ రాష్ట్ర సమితి)గా మార్చుకునే సమయం ఆసన్నమైందని యావత్ తెలంగాణ ప్రజలు అభిప్రాయ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
చెల్లి-బావ ఫోన్లను ట్యాప్ చేసిన వ్యక్తులు సభ్యత, సంస్కృతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫాంహౌస్ పార్టీకి గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు కట్టిన పార్టీకి మధ్య జరిగే పోటీలో మరోసారి కారు తుక్కు తుక్కు కావడం ఖాయం. ఇది ప్రజల నిర్ణయం అని జోష్యం చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
