అమరావ‌తిని అడ్డుకునేంత ద‌మ్ము జ‌గ‌న్ కు లేదు

నిప్పులు చెరిగిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : జగన్ పది జన్మలెత్తినా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేడని, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సీమాంధ్రుల కలల రాజధానిని నిర్మించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. లండన్ మందులు పని చేయక పోవడంతో జగన్ బుర్ర పనిచేయడం లేదని, ప్రతి ఎన్నికల ముందు రాజధానిపై ఆయన తన స్టాండ్ మారుస్తున్నారని మండిపడ్డారు. తల్లికి, చెల్లికి గౌరవమివ్వమని జగన్… రాష్ట్రంలోని మిగిలిన మహిళల పట్ల చులనక భావంతో చూస్తూ, అవమానిస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హోంమంత్రి అనిత కట్టుబొట్టు కోసం మాట్లాడిన వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తల్లి పెంపకం ఇదేనా..? అని ఘాటుగా విమర్శించారు. సీఎం చంద్రబాబునాయుడు హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, అయిదేళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగానికి ఒరిగిందేమీ లేదన్నారు.

జగన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయనకు లండన్ మందులు పనిచేయడం లేదని అన్నారు ఎస్. స‌విత‌. ప్రతి ఎన్నికల ముందు రాజధాని అంశంపై స్టాండ్ మారుస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో అమరావతికి జైకొట్టి, ప్రజలను వంచించి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. సీఎం కుర్చీ ఎక్కగానే మాట మార్చి, మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. అయిదేళ్ల పాటు మూడు రాజధానులపై మాట్లాడడమే తప్ప, ఏ ప్రాంతంలోనూ బస్తా సిమ్మెంట్ కూడా వేయలేదన్నారు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానులు అంటూ హడావుడి చేసిన జగన్ కు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. బుద్ధి మారని జగన్..ఇపుడు మావిగన్ అంటూ మరో డ్రామాకు తెరతీశారన్నారు స‌విత‌. రాజధాని అంశంపై రోజుకో పిల్లిమొగ్గ వేస్తున్న జగన్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆయన పది జన్మలెత్తినా అమరావతి రాజధానిని అడ్డుకోలేరన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సీమాంధ్రుల కలల రాజధానిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలపైనా, అభివృద్ధిపైనా ఎందుకింత కక్ష అని జగన్ ను మంత్రి సవిత ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!