అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ కారణాలతో బలవన్మరణం చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తోంది. 2019–24 వైసీపీ హయాంలో 1,496 రైతు ఆత్మహత్యలు నమోదవగా, అందులో 1,400 కుటుంబాలకు మాత్రమే ఎక్స్‌గ్రేషియా చెల్లించిందని ఆరోపించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. 96 కుటుంబాలకు సాయం పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో బకాయి ఉన్న కుటుంబాలకు రూ.5.67 కోట్లు విడుదల చేసిందన్నారు. గత రెండేళ్లలో 540 రైతు ఆత్మహత్యలు అన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తూ, ఇప్పటి వరకు 148 కేసులే రైతు ఆత్మహత్యలుగా నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నట్లు తెలిపారు.
వీటిలో 112 కుటుంబాలకు బిల్లులు సమర్పించగా , పాత బకాయిలతో కలిపి మొత్తం 208 కుటుంబాలకు రూ.14.56 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదలకు బిల్లులు సిద్ధం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.ఎరువుల విషయంలో మొసలి కన్నీరు కార్చొద్దు జగన్ అని హితవు పలికారు. రైతులకు ఇబ్బందులు రాకూడదు అనే యాప్ తెచ్చాం అన్నారు. కౌలు రైతులకి ఎరువులు అందటం లేదు అంటున్నావు. గతంలో లా యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేందుకు మీ కార్యకర్తలకు, నీ అనుకూల వ్యక్తులకు లాభం చేకూరటం లేదని బాధ పడుతున్నావా అంటూ ఎద్దేవా చేశారు.
అక్రమాలను ఆపేందుకు యాప్ ను తీసుకొచ్చాం అని తెలిపారు. అసలు నీకు యాప్ ఉపయోగాలు తెలుసా, ఎరువులు అందకపోతే ఇన్ని బస్తాలు రైతులకు ఎలా చేరాయో తెలుసుకోక పోవడం దారుణమన్నారు. రతు సేవా కేంద్రానికి వెళ్లి కౌలు రైతులు తన భూమిని నమోదు చేయాలని వీఏఏ ని అడగగానే ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తున్నారని తెలుసుకో జగన్ అని అన్నారు, జూన్ 8–30 మధ్య 26 జిల్లాల్లో 3,88,195 మంది రైతులకు 17,25,467 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో 14,12,093 యూరియా బస్తాలు , 3,13,374 డీఏపీ బస్తాలు ఉన్నాయన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ FFS కింద కాకినాడ, కృష్ణా జిల్లాల్లో జూన్ 12–జూలై 1 మధ్య 2,45,562 బస్తాలు పంపిణీ చేశామని తెలిపారు. మొత్తం 28 జిల్లాల్లో సుమారు 75,000 కౌలు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు పొందారు. ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
