అమరావతి : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి అచ్చెన్నాయుడు. తన పాలనా కాలంలో రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు వారి గురించి వకల్తా పుచ్చు కోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి కంటే రాజకీయ లబ్ధిపైనే ఎక్కువ దృష్టి ఉన్నట్లు కనిపిస్తోందని, గత ఐదేళ్లు అధికారంలో ఉండి రైతులకు చేసిందేమీ లేదని, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీళ్లు కార్చడం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోడు వినిపించ లేదు… ఇప్పుడు మాత్రం ప్రెస్‌మీట్లు పెట్టి రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్ల పాలనలో ఎందుకు చూపించ లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, వ్యవసాయం, సాగునీటి రంగాలను సంక్షోభంలోకి నెట్టిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతోందని అన్నారు . కానీ ఆ వాస్తవాలను ప్రజల దృష్టికి రానివ్వకుండా తప్పుడు ప్రచారం చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు అచ్చెన్నాయుడు. అబద్ధాలను పదేపదే చెబితే నిజాలుగా మారవని, ప్రజలు ఇప్పటికే తన పాలనకు తీర్పు ఇచ్చారని ఆయన గుర్తుంచు కోవాలన్నారు. పొగాకు ధరలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందనడం మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అంశంపై అవగాహన లేకపోవడానికే నిదర్శనం అన్నారు. పొగాకు ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్–సప్లై, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పొగాకు బోర్డు విధానాల ఆధారంగానే నిర్ణయించడ జరుగుతుందని ఆ విషయం తెలుసుకోక పోవడం దారుణమన్నారు మంత్రి.
