విద్యుత్ ఉత్ప‌త్తికి స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు

ఉన్నాయ‌న్న కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వ‌లకు ఇబ్బందులు ఉన్నాయంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను తోసిపుచ్చారు. 80 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 2014 నుండి ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అర్జెంటీనాలో స్వాధీనం చేసుకున్న కీలక ఖనిజ బ్లాక్‌లలో అన్వేషణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీలైనంత త్వరగా ఉత్పత్తిని మొదలు పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. గతంలో బొగ్గు కొరత ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ స‌మ‌స్య లేద‌న్నారు కిష‌న్ రెడ్డి. విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు భారత ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రుతుపవనాల సీజన్ ప్రారంభమైనందున, భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాము 80 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. కీలక ఖనిజాల ప్రాముఖ్యతను వివరిస్తూ కేంద్రం ఆ ఖనిజ నిల్వలను గుర్తించి, అన్వేషణ కార్యకలాపాలను చేపడుతోందని రెడ్డి చెప్పారు. అన్వేషణ పూర్తయిన ప్రాంతాల్లో వేలం ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన లేదా పాక్షికంగా ప్రాసెస్ చేసిన కీలక ఖనిజాలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలని ప్రైవేట్ సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. గత యూపీఏ హయాంలో బొగ్గు రంగంలో కుంభకోణాలు వార్తల్లో నిలిచేవని ఆరోపించారు. ప్రస్తుతం దేశం ఏటా రికార్డు స్థాయిలో 1,040 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోందని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!