పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. వెన్నుపోటుకు జగన్ కేరాఫ్ అడ్రాస్ గా ఉంటే, యువత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే పారదర్శక పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల ఆకాంక్షల మేరకు సాగుతోందన్నారు. రెండేళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పట్టిస్తున్నారన్నారు. ఒకవైపు అమరావతి, మరో వైపు పోలవరం, ఇంకోవైపు రోడ్లు, కాలువలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనతో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఏపీ ప్రజలకు రుచి చూపిస్తున్నారన్నారు.
పెనుకొండ నియోజక వర్గంలోనూ చరిత్ర చూడని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు ఎస్. సవిత. అటు రాష్ట్రంలోనూ, ఇటు నియోజక వర్గంలోనూ రెండేళ్లలో కనివినీ ఎరుగని అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు చేశామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తరవాత జగన్ వ్యవహార శైలికి పొంతనే లేదని మంత్రి సవిత మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలో వచ్చిన జగన్ కుట్రలు, కుతంత్రాలు, కూల్చివేతలతో పాలన సాగిందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను జగన్ కూల్చివేయడం మరిచిపోలేని ఘటన అని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ కుట్రలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టారన్నారు. రాయలసీమ బిడ్డనంటూ ఈ ప్రాంతంలోనూ ఎటువంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగ యువతను మోసగించారన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరగనుకున్నా బురదజల్లి… మెరిట్ లిస్గ్ ఎంపికైన అభ్యర్థులను అవమానిస్తున్నారన్నారు. రాయలసీమకే కాదు రాష్ట్రానికి వెన్నుపోటు దారుడు జగనే అని మంత్రి సవిత మండిపడ్డారు.
